"వినయ విధేయ రామ" మూవీ రివ్యూ

"వినయ విధేయ రామ" మూవీ రివ్యూ

చిత్రం: వినయ విధేయ రామ

నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు

నిర్మాత: డీవీవీ దానయ్య

దర్శకత్వం: బోయపాటి శ్రీను

సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌

మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బోయపాటి శ్రీను. భద్రనుంచి జయ జానకి నాయకవరకూ ఆయన కథల్లో కొండంత హీరోయిజం కనిపిస్తుంటుంది. ఇప్పుడు రామ్‌చరణ్‌ని వినయ విధేయ రామగా చూపించారు. మరి బోయపాటి మాస్‌ హీరోగా చెర్రీ ఎలా కనిపించారు. సాఫ్ట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమా ఎలా ఉంది? ప్రతి నాయకుడిగా నటించిన వివేక్‌ ఒబెరాయ్‌ ఏవిధంగా మెప్పించారు?

క‌థేంటంటే: ఐదుగురు అన్నదమ్ములున్న (ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌, రామ్‌ చరణ్‌) అందమైన ఫ్యామిలీలో అందరి కన్నా చిన్నవాడు రామ్ కొణిదెల. అత‌నంటే అంద‌రికీ ఇష్టం. అలాగే కుటుంబం అంటే రామ్ కూడా చాలా ఇష్టం. రామ్ పెద్ద‌న్న (ప్ర‌శాంత్‌) విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) అరాచ‌కాల‌ను రామ్ పెద్ద‌న్న బ‌య‌ట పెడ‌తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. అది నచ్చని పరశురాం.. రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అందుకు బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. మున్నాభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రిగింది? అన్న‌య్య‌కు, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఈ చిత్రం రెండు ఛాయాల్లో సాగుతుంది. ఓ వైపు పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగితే, మరోవైపు త‌న అన్న‌కు, కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఒక త‌మ్ముడు చేసే పోరాటం ఇందులో కనిపిస్తుంది. బోయ‌పాటి చిత్రాల్లో స‌హ‌జంగా యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుంది. అదే స‌మ‌యంలో కుటుంబ బంధాలు, అనుబంధాల‌ను చూపిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయ‌న ఎంచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం అవి రెండూ ఇంకాస్త పెరిగాయి. ఒక కుటుంబంలో అన్నావ‌దిన‌లు, వారి పిల్ల‌ల మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అదంతా తెర‌పై చాలా అందంగా, రిచ్‌గా చూపించారు. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డ‌తారు. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్ల‌కు వ‌చ్చేస‌రికి మ‌రో స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు బోయ‌పాటి. కియారా అడ్వాణీతో కొన్ని స‌న్నివేశాలు, ఆఫీస్‌లో జ‌రిగే ఎపిసోడ్ల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అల‌రిస్తుంది. అయితే, ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ల మూలంగా క‌థ బాగా న‌లిగిపోయింది. యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే స‌న్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడు. విరామం వ‌ర‌కూ ఈ సినిమాలో క‌థే ఉంటుంది. కానీ, దాని ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మాస్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి.

ద్వితీయార్ధమంతా రామ్‌.. మున్నాభాయ్‌ల పోరు క‌న‌ప‌డుతుంది. హింస‌, ర‌క్త‌పాతం, హీరోయిజం మ‌రోస్థాయిలో ఉంటాయి. ప్ర‌థ‌మార్ధంలో క‌నిపించే ఫ్యామిలీ డ్రామా, ఎమోష‌న్స్‌, ల‌వ్ సీన్లు, ఫ‌న్ ఇవేవీ క‌నిపించ‌వు. రామ్‌చ‌ర‌ణ్‌లో ఫైట‌ర్‌ను చూడాలంటే ఈ సినిమా త‌ప్ప‌కుండా చూడాల్సిందే!

బ‌లాలు

  • యాక్ష‌న్ ఎపిసోడ్లు
  • రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు
  • మాస్ ఎలిమెంట్స్‌

బ‌ల‌హీన‌త‌లు

  • మితిమీరిన హింస‌
  • క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం

మరిన్ని కథనాలు