తేజ్.. ఐ లవ్ యు మూవీ రివ్యూ

తేజ్.. ఐ లవ్ యు మూవీ రివ్యూ

తారాగ‌ణం : సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ 

సంగీతం : గోపీ సుంద‌ర్

ఛాయాగ్ర‌హ‌ణం : అండ్రూ.ఐ

మాట‌లు : డార్లింగ్ స్వామి

కూర్పు : ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌

క‌ళ‌ : సాహి సురేశ్‌

స‌హ నిర్మాత‌ : వ‌ల్ల‌భ‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ : ఎ.క‌రుణాక‌ర‌న్‌

నిర్మాత‌ : కె.ఎస్‌.రామారావు

నిర్మాణ సంస్థ‌ : క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్‌

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సాధించుకునేందుకు కష్టపడుతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలు అందుకున్నా.. తరువాత కెరీర్ గాడి తప్పింది. ఎలాగైనా హిట్ కొట్టాల‌నుకుంటున్న త‌రుణంలో ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ క‌రుణాక‌ర‌న్‌తో జ‌త క‌ట్టాడు. నాలుగేళ్ల త‌ర్వాత క‌రుణాక‌ర‌న్ మరో ప్రేమ‌క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. `తేజ్ ఐ ల‌వ్ యు` పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించింది?. అస‌లు ఈ ప్రేమ‌క‌థ‌లో క‌రుణాక‌ర‌న్ చెప్పాల‌నుకున్న విష‌య‌మేంటి? అనే సంగ‌తి తెలియాలంటే సినిమా క‌థ తెలుసుకుందాం.

కథ : తేజ్‌ (సాయి ధరమ్‌ తేజ్‌) చిన్నతనంలోనే అమ్మానాన్నకు దూరం కావటంతో పెద్దమ్మ(పవిత్రా లోకేష్‌) పెదనాన్న(జయ ప్రకాష్‌), పిన్నీ బాబాయ్‌లు గారాభంగా చూసుకుంటుంటారు. కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకునే తేజ్‌, పదేళ్ల వయస్సులో ఓ మహిళను కాపాడే ప్రయత్నలో హత్య చేసి జైలుకెళతాడు. ఏడేళ్ల శిక్ష తరువాత ఇంటికి తిరిగి వచ్చిన తేజ్‌ను ఆ కుటుంబం మరింత ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఓ సంఘటన మూలంగా తేజ్‌ను ఇంటి నుంచి గెంటేస్తారు. దాంతో కాలేజీ అయిపోయాక స‌ప్లీలు రాసుకుంటూ హైద‌రాబాద్‌లోని బాబాయ్ (పృథ్వి) ఇంట్లో ఉంటాడు. అలా కాలేజీలో కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ఓ రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలాంటి స‌మ‌యంలోనే అత‌నికి నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. అనుకోకుండా జ‌రిగిన అగ్రిమెంట్ కార‌ణంగా 15 రోజులు ఆమెకు అత‌ను బాయ్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. ఆ గ‌డువు పూర్త‌య్యేలోపు ఆమే అత‌నికి గ‌ర్ల్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డుతుంది. ఇలా ఒక‌రికి ఒక‌రు చేరువ‌య్యే క్ర‌మంలో నందినికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ కి కార‌ణం ఎవ‌రు? న‌ందినిని ఫాలో చేస్తున్న వారు ఎవ‌రు? ఆమెకు ఎవ‌రి వ‌ల్ల ప్ర‌మాదం. లండ‌న్ నుంచి నందిని అస‌లు ఇండియాకు ఎందుకు వ‌చ్చింది? ఆమె తండ్రి ఆమెకు మంచి చేశాడా? చెడు చేశాడా? ఇంత‌కీ తేజ్‌, నందిని ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారా? ఆ విష‌యం ప‌రస్ప‌రం చెప్పుకున్నారా? లేదా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

విశ్లేషణ : కరుణాకరన్ సినిమా అంటే యూత్‌ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. తొలిప్రేమ, డార్లింగ్‌ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కరుణాకరన్ ఇటీవల ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నాడు. ప్రేయ‌సి మీద గుండెల నిండా ప్రేమ ఉన్నా, అది ఆమెకు ఎక్క‌డో న‌చ్చ‌దో అనే ఏకైక కార‌ణంగా, ఆమెను ఇబ్బది పెట్ట‌డం ఇష్టంలేకుండా ప్ర‌వ‌ర్తించే హీరోలు మ‌న‌కు కొత్త‌కాదు. పోనీ అది పాత విష‌య‌మే అయినా, ద‌ర్శ‌కుడు ఎక్క‌డా కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్న‌మూ చేయ‌లేదు. క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్‌గానే అనిపించింది. అక్కడక్కడా కామెడీ పండినా.. సినిమాను నిలబెట్టే స్థాయిలో మాత్రం లేదు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం చాలా ఇంపార్టెంట్‌. కానీ మ్యూజిక్‌ డైరెక్టర్ గోపిసుందర్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ నిరాశపరిచాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ : సాయిధ‌ర‌మ్‌తేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ నటన 

                         ఫ్యామిలీ ఎమోషన్స్‌

మైనస్ పాయింట్స్ : సంగీతం

                             స్క్రీన్‌ప్లే

రేటింగ్ : 2.75/5