"సీత" మూవీ రివ్యూ

"సీత" మూవీ రివ్యూ


నటీనటులు: కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్‌, మన్నారా చోప్రా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు

కూర్పు: వెంకటేశ్వరరావు కోటగిరి

సినిమాటోగ్రఫీ: శీర్షా రే

దర్శకుడు: తేజ

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌

కథేంటంటే: సీత (కాజ‌ల్‌)కి డ‌బ్బే లోకం. డ‌బ్బే స‌ర్వస్వం. అందితే కాళ్లు, లేదంటే జుట్టు ప‌ట్టుకునే ర‌కం. రియ‌ల్ ఎస్టేట్ దందాలో వంద కోట్లు పోతున్నాయ‌ని ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు (సోనూసూద్‌)తో నెల రోజులు స‌హ‌జీవ‌నం చేయ‌డానికి ఒప్పుకొంటుంది. త‌న ప‌ని అయిపోగానే.. బ‌స‌వ‌రాజుకి అందకుండా తిరుగుతుంటుంది. త‌న కోరిక తీర్చుకోవాల‌నుకునే బ‌స‌వ‌రాజు.. సీత‌ని నానార‌కాలుగా ఇబ్బంది పెడుతుంటాడు. బ‌స‌వ‌రాజు వ‌ల్ల సీత అప్పుల్లో కూరుకుపోతుంది. త‌న ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి భూటాన్‌లో ఉన్న అత్త కొడుకు రామ్ (బెల్లంకొండ శ్రీ‌నివాస్‌) ద‌గ్గరకు వెళ్తుంది. రామ్ అమాయ‌కుడు. త‌న‌కు సీతే లోకం. సీత‌కు డ‌బ్బే ప్రాణం. త‌న అవ‌స‌రాల కోసం రామ్‌ని సీత‌ ఎలా వాడుకోవాల‌ని చూసింది? సీత మ‌న‌సులో రామ్ ఎలా స్థానం సంపాదించుకున్నాడు? బ‌స‌వ‌రాజు నుంచి సీత త‌ప్పించుకుందా, లేదా?అనేదే మిగిలిన క‌థ‌.

ఎలా ఉందంటే?: మూడు పాత్రల ప్రయాణం సీత‌. కాజ‌ల్, బెల్లంకొండ‌, సోనూసూద్ పాత్రలు, అవి ప్రవ‌ర్తించే తీరు ఈ సినిమాకి మూలం. సీత‌గా కాజ‌ల్ పాత్ర వైవిధ్యంగా సాగుతుంది. త‌న క్యారెక్టరైజేష‌న్‌పైనే ఎక్కువ స‌న్నివేశాల్ని న‌డిపించారు. సోనూసూద్ పాత్ర కూడా విభిన్నంగానే ఉంటుంది. ఆ పాత్ర నుంచి కావాల్సినంత వినోదం పండించే ప్రయత్నం చేశారు దర్శకుడు. డ‌బ్బు త‌ప్ప‌, మ‌నుషుల‌కు అనుబంధాల‌కు విలువ ఇవ్వని ఓ అమ్మాయిని, ఓ అతి మంచివాడు ఎలా మార్చాడన్నది ఈ సినిమా. పాయింట్ బాగానే ఉంది. అయితే.. ద‌ర్శకుడు చివ‌రివ‌ర‌కూ ఇదే పాయింట్‌ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో తడబడ్డాడు. సీత క్యారెక్టరైజేష‌న్‌పై అతిగా ఆధార‌ప‌డిపోయిన తేజ.. మిగిలిన పాత్రల్ని అంత స‌వ్యంగా, ప్రభావ‌వంతంగా న‌డిపించలేక‌పోయారు. రామ్‌గా బెల్లంకొండ శ్రీ‌నివాస్ పాత్ర చూస్తుంటే చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఒక్కోసారి రామ్ అతి మంచిత‌నం కూడా ప్రేక్షకుల్ని విసిగిస్తుంటుంది.

అయితే తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ని ఈ మూడు పాత్రల‌తోనే చెబుతూ.. ఆ పాత్రల నుంచి, వాళ్ల స్వభావాల నుంచే వినోదం పండించే ప్రయ‌త్నం చేశారు దర్శకుడు. ఈ పాత్రల్ని కాద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. సినిమా బోర్ కొడుతుంటుంది. ప‌తాక స‌న్నివేశాలు ఊహించిన‌వే. సీత‌లో మార్పు రావ‌డంతో క‌థ ముగుస్తుంది. అయితే.. చివ‌ర్లో `తేజ‌` మార్కు హింస‌, ర‌క్తపాతం మితిమీరి సాగుతుంది. సినిమా అయిపోయింది.. అనుకున్నప్పుడు కూడా మ‌రో సీన్ జోడించి ఇంకాస్త విసిగిస్తారు. పాట‌లు క‌థ‌లో భాగంగా వ‌స్తాయి. పోరాట స‌న్నివేశాల్లో అతి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మొత్తానికి `సీత‌` పాత్రని మిన‌హాయిస్తే.. `సీత`లో కొత్త పాయింటేం క‌నిపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే?: సీత‌గా కాజ‌ల్ న‌ట‌నే ఈ చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. డ‌బ్బు వ్యామోహంతో, మ‌నుషుల్ని మాన‌వ‌త్వాన్ని మ‌ర్చిపోయిన ఇలాంటి క‌థానాయిక పాత్రని ఎప్పుడో గానీ చూడం. ఆ పాత్రలో కాజ‌ల్ బాగానే చేశారు. కాక‌పోతే.. త‌న మేక‌ప్ ఓవ‌ర్‌గా అనిపిస్తుంది. రామ్‌గా బెల్లంకొండ ఓకే అనిపిస్తారు. అయితే, ఈ పాత్రని ఇంకాస్త బాగా తీర్చిదిద్దొచ్చు అనిపిస్తుంది. సోనూసూద్ విల‌నిజం వెరైటీగా ఉంది. త‌నికెళ్ల భ‌ర‌ణి సెటైర్లు బాగానే పేలాయి. బిత్తిరి స‌త్తి ‘ఆర్కెస్ట్రా’  కాస్త మితిమీరింది. కాజల్‌, బెల్లకొండ, సోనూసూద్‌ల పాత్రలు మిన‌హాయిస్తే.. మిగిలిన ఎవ్వరికీ చెప్పుకోద‌గిన స్కోప్ లేదు. ఆఖ‌రికి కోట కూడా ఒక్క సీన్‌కే ప‌రిమితం అయ్యారు. మిగిలిన పాత్రలను కూడా బలంగా చూపించి ఉంటే ఇంకాస్త బాగుండేది

సాంకేతికంగా.. అనూప్ నేప‌థ్య సంగీతం బాగుంది. పాట‌లూ ఫ‌ర్వాలేదు. ల‌క్ష్మీభూపాల్‌ సంభాష‌ణ‌లు అక్కడక్కడా మెప్పిస్తాయి. తొలి స‌గం కాజ‌ల్‌పై, మ‌లిస‌గం బెల్లంకొండ అతి మంచిత‌నంపై బేస్ అయి సాగిన సినిమా ఇది. ఇలాంటి క‌థ‌ని డీల్ చేయ‌డం క‌ష్టం. ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాలు, ఎమోష‌న్ ఉంటేగానీ వ‌ర్కవుట్ అవ్వవు.

రేటింగ్ : 2.5/5