"మహానాయకుడు" మూవీ రివ్యూ

"మహానాయకుడు" మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి

నిర్మాణ సంస్థ‌లు: ఎన్‌.బి.కె.ఫిలింస్ , వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి

తారాగ‌ణం: నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.

సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

ఛాయాగ్ర‌హ‌ణం: వి.ఎస్‌.జ‌్ఞాన‌శేఖ‌ర్

క‌థా స‌హ‌కారం: డా.ఎల్‌.శ్రీనాథ్‌

మాట‌లు: సాయిమాధ‌వ్ బుర్రా

పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

క‌ళ‌: సాహి సురేష్‌

స‌హ నిర్మాత‌: ఎం.ఆర్‌.వి.ప్ర‌సాద్‌

నిర్మాత‌లు: న‌ంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నందమూరి బాల‌కృష్ణ‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి క్రిష్‌

 కథ : 

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన త‌ర్వాత తెలుగుదేశం జెండాను, ఎజెండాను రూపొందించే స‌న్నివేశంతో `య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` స్టార్ట్ అయ్యింది. అంత‌క ముందుగానే అస‌లు రాముడు తారక రాముడు ఎందుక‌య్యాడు.. ఆయ‌న చేతిలో కృష్ణుడి బొమ్మ ఎందుకు ఉంటుంది.. అలాగే బ‌స‌వ తార‌క‌మ్మ‌తో ఆయ‌న పెళ్లి ఎలాంటి ప‌రిస్థితుల్లో అయ్యింది? ఇలాంటి విష‌యాన్ని ఓ పాట‌లో చూపించారు. ఇక అస‌లు క‌థ‌కు వ‌స్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌, ప్ర‌జ‌ల్ని పార్టీలు ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఢిల్లీ నుండి వ‌చ్చే క‌వ‌ర్ ముఖ్య‌మంత్రిని నిర్ణ‌యించ‌డం.. ఇలాంటివ‌న్నీ చూసిన ఎన్టీఆర్ చైత‌న్య‌ర‌థంను సిద్ధం చేసుకుని.. దానిపై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. తిరుగులేని ఆధిక్య‌త‌తో విజ‌యాన్ని సాధిస్తారు. వ్య‌వ‌స్థ‌లోని లంచం, అవినీతిని రూపుమాపే క్ర‌మంలో కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. త‌న పార్టీకి చెందిన వారిపై కూడా అధికారుల‌తో దాడులు చేయించ‌డం వంటి ప‌నులు చేశారు.

దీని వ‌ల్ల ఎమ్మెల్యేల్లో కాస్త అసంతృప్తి నెల‌కొంది. అదే స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి బ‌స‌వ తారకంకు క్యాన్స‌ర్ ఉంద‌ని తెలియ‌డం.. ఆమె చికిత్స‌తో పాటు.. ఎన్టీఆర్ త‌న గుండె ఆప‌రేష‌న్ కోసం ఆయ‌న భార్య‌తో క‌లిసి అమెరికా వెళ‌తారు. అదునుగా భావించిన నాదెండ్ల భాస్క‌ర్‌రావు, ఎమ్మెల్యేలు వారి అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ ఓ లేఖ రాస్తారు. దాంతో పాటు సంత‌కాలు కూడా చేస్తారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని భాస్క‌ర్ రావు లేఖ‌ను అవిశ్వాస తీర్మానంగా మార్చేసి ముఖ్య‌మంత్రి అయిపోతారు. హైద‌రాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని ఎలా ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎలాంటి పరిస్థితుల‌ను ఎదుర్కొన్నారు. మ‌ళ్లీ ముఖ్యమంత్రి ఎలా అయ్యార‌నేది చూపించారు. ఈ మ‌ధ్య‌లో నారా చంద్ర‌బాబునాయుడు తెలుగుదేశంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు. ఆగ‌స్ట్ సంక్షోభంలో చంద్ర‌బాబు, ఎన్టీఆర్‌కు ఎలా వెన్నుద‌న్నుగా నిలిచారనే అంశాల‌ను ఈ రెండో భాగంలో చూపించారు. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ కార‌ణంగా శివైక్యం కావ‌డంతో సినిమా ముగుస్తుంది.

విశ్లేష‌ణ‌:

నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా సినిమా హీరో.. రాజ‌నీయ నాయ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను అద్భుతంగా చూపించారు. అలాగే ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే క్ర‌మంలో చైత‌న్య ర‌థంలోనే ఉంటూ ప్ర‌చారం చేయ‌డం.. రోడ్ల‌పైనే స్నానాలు చేయ‌డం ఇలాంటి స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా చూపించారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో న‌టించిన రానా.. మామ‌కు ఎంత స‌హ‌కారం అందించారు. పార్టీ శ్రేణుల‌ను గ్రామాల్లో బ‌లోపేతం చేయ‌డానికి ఎలాంటి కృషి చేశారు.. అనే అంశాల‌ను ఇందులో చూపించారు. అలాగే ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. తెలుగు గంగ ప్రాజెక్ట్‌తో త‌మిళ‌నాడుకు నీళ్లు అందించ‌డం.. అవినీతి నిర్మూల‌నలో త‌న పార్టీ వాళ్లు ఉన్న కూడా ఆపేక్షించ‌క వారిపై చ‌ర్య తీసుకున్న క్ర‌మంలో ఉన్న అసంతృప్తిని ఆస‌రాగా చేసుకుని నాదెండ్ల భాస్క‌ర్‌రావు.. ఎన్టీఆర్ చికిత్స కోసం యు.ఎస్‌లో ఉన్న‌ప్పుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించుకోవ‌డం .. ఇలాంటి స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా చూపించారు.

రేటింగ్:

3/5