F2 మూవీ రివ్యూ

F2 మూవీ రివ్యూ

చిత్రం: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

నిర్మాత: దిల్‌రాజు

దర్శకత్వం: అనిల్‌ రావిపూడి

సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

పటాస్‌’, సుప్రీమ్‌, ‘రాజా ది గ్రేట్‌ఈ మూడు చిత్రాలు చాలు దర్శకుడిగా అనిల్‌ రావిపూడి టేకింగ్‌ ఏంటో! ప్రేక్షకులను కితకితలు పెడుతూనే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడం ఎలాగో ఆయనకు తెలుసు. ఇక కామెడీ టైమింగ్‌లో వెంకటేష్‌ గురించి వేరే చెప్పనక్కర్లేదు. తన 30ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అలాంటి పాత్రలెన్నో చేశారు. మరి వీరిద్దరికీ యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ కూడా కలిస్తే ఆ ఫన్‌ రెండింతలవుతుంది. కానీ, తమన్నా, మెహరీన్‌లను పెళ్లి చేసుకున్న తర్వాత ఫన్‌ పోయి ఫ్రస్ట్రేషన్‌ ఎలా వచ్చింది? ఆ ఫ్రస్ట్రేషన్‌లో వాళ్లు ఏం చేశారు? సంక్రాంతి అలుళ్లకు ఎదురైన అనుభావాలేంటి? చూడాలంటే ఎఫ్‌2’కు వెళ్లాల్సిందే!

క‌థేంటంటే:  హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. వెంకీ (వెంక‌టేష్‌) ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తుంటాడు. హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. అప్పటివ‌ర‌కూ సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. భార్య‌, అత్త వెంకీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు య‌త్నిస్తుంటారు. వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) హ‌నీని ఇష్ట‌ప‌డ‌తాడు. అప్ప‌టికే అత్తింటి ప‌రిస్థితులు అర్థ‌మైన వెంకీ.. హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌యాద‌వ్‌ను హెచ్చ‌రిస్తాడు. ప్రేమ మ‌త్తులో వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్ట‌వు. చివ‌ర‌కు హ‌నీని పెళ్లి చేసుకుంటాడు. అప్ప‌టి నుంచి అక్కాచెల్లెళ్ల ఆధిప‌త్యానికి తోడ‌ళ్లులు న‌లిగిపోతుంటారు. మీరిద్ద‌రూ ఎక్క‌డికైనా వెళ్లిపోండ‌ని, అప్పుడే అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలిసి వ‌స్తుంద‌ని, ప‌క్కింటి వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఈ తోడ‌ల్లుళ్లకు స‌ల‌హా ఇస్తాడు. దీంతో ఇద్ద‌రూ యూర‌ప్ వెళ్తారు. అయితే, వెంకీ.. వ‌రుణ్‌ల‌తో పాటు, హారిక‌.. హ‌నీలు కూడా యూర‌ప్ వెళ్తారు. వీరంద‌రూ ప్ర‌కాష్‌రాజ్ ఇంట్లో తిష్ట వేస్తారు. ఇంత‌కీ వీళ్లు యూర‌ప్ ఎందుకు వెళ్తారు? ప‌ర్ కాష్‌రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగార‌న్న‌ది అస‌లు క‌థ‌. చివ‌ర‌కు పెళ్లాల‌ మనసు మార్చారాలేక వీళ్లే మారిపోయారా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే!

ద‌ర్శ‌కుడు ముందు నుంచీ ఇది భార్య బాధితుల సినిమా అని చెబుతూనే ఉన్నాడు. వారు ప‌డే ఇబ్బందుల నుంచి ఫ‌న్ ఎలా పుట్టుకొచ్చింద‌నేది సినిమాలో చూపించాడు. ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. నువ్వు నాకు న‌చ్చావ్‌’, ‘మ‌ల్లీశ్వ‌రీలాంటి చిత్రాల్లో వెంక‌టేష్ చేసిన పాత్ర‌లు మ‌ళ్లీ ఈ మ‌ధ్య కాలంలో చేయ‌లేదు. చాలా రోజుల త‌ర్వాత ఆ స్థాయి పాత్ర‌లో వెంక‌టేష్‌ను చూస్తాం. తొలి స‌గం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ద్వితీయార్ధం మొత్తం యూర‌ప్ చుట్టూ తిరుగుతుంది. అయితే, ప్ర‌థ‌మార్ధంలో ఉన్న బ‌లం ద్వితీయార్ధంలో క‌నిపించ‌దు. కానీ, ఈ రెండు జంట‌లు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం కిక్ ఇస్తాయి. చివ‌రిలో నాజ‌ర్ పాత్ర ప్ర‌వేశించ‌డం కూడా క‌లిసి వ‌చ్చేదే. అక్క‌డ కూడా డైలాగ్‌లు చాలా బాగున్నాయి. మొత్తంగా ఇది ఒక ఫ‌న్ రైడ్ సినిమా. అయితే, వినోదాన్ని పండించ‌డంలో కొన్ని చోట్ల శ్రుతి మించిన‌ట్లు అనిపిస్తుంది. పాత్ర‌లు కూడా కొన్నిసార్లు ఓవ‌ర్‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌నిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో ఉన్న బిగి ద్వితీయార్ధంలో రాదు. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ర‌చ‌యిత‌గా అనిల్‌రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. త‌న బ‌లం వినోద‌మే. దాన్ని సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ ప్ర‌తి సీన్‌లో పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ, ఎఫ్‌2 చాలా చిన్న క‌థ‌. తొలి స‌న్నివేశాల్లోనే మ‌న‌కు అర్థ‌మైపోతుంది. ట్విస్టులు, హంగుల‌వైపు వెళ్ల‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. అయితేపాట‌లు అన్నీ ఆక‌ట్టుకోలేదు. యూర‌ప్‌లో తెర‌కెక్కించిన పాట మాత్రం బాగుంది. కెమెరా ప‌రంగా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ సినిమా. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

బ‌లాలు

  • వెంక‌టేష్ కామెడీ
  • ప్ర‌థ‌మార్ధం
  • డైలాగ్‌లు, నిర్మాణ విలువ‌లు

బ‌ల‌హీన‌త‌లు

  • ద్వితీయార్ధం
  • పాట‌లు
  • క‌థ‌