చిత్రలహరి మూవీ రివ్యూ

చిత్రలహరి  మూవీ రివ్యూ

నటీనటులు: సాయి ధరమ్‌ తేజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌ తదితరులు

ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని 

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 

కళ: ఎ.ఎస్‌.ప్రకాష్ 

నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌ (సీవీఎమ్‌)

దర్శకత్వం: కిషోర్‌ తిరుమల

వరుసగా ఆరు సినిమాలతో పరాజయాన్ని చవిచూశాడు సాయిధరమ్‌ తేజ్‌. ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న ఆయన... ఆ విజయం నేపథ్యంలో సాగే కథనే ఎంచుకుని ‘చిత్రలహరి’ చేశాడు. ‘నేను శైలజ’తో విజయాన్ని అందుకున్న కిషోర్‌ తిరుమల... ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం కాస్త ఆసక్తిని రేకెత్తించింది. ప్రచార చిత్రాలు కూడా అంచనాల్ని పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

కథేంటంటే: విజయం అంటే ఏంటో తెలియని యువకుడు విజయ్‌కృష్ణ (సాయిధరమ్‌ తేజ్‌). ప్రతిభ ఉన్నప్పటికీ చిన్నప్పట్నుంచే అతన్ని పరాజయాలు వెంటాడుతుంటాయి. తన జీవితంలో వెలుగంటూ ఏదైనా ఉందంటే అది లహరి (కల్యాణి ప్రియదర్శన్‌) మాత్రమే. కానీ ఆమె కూడా తన చిన్ననాటి స్నేహితురాలైన స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌) మాటలు విని... విజయ్‌పై నమ్మకాన్ని కోల్పోతుంది. అతడి నుంచి దూరమవుతుంది. కానీ స్వేచ్ఛ వల్లే విజయ్‌ కృష్ణ తాను అనుకున్నది సాధిస్తాడు? అదెలా? అటు జీవితంలో, ఇటు ప్రేమలో పరాజితుడిగా మిగిలిపోయిన విజయ్‌ ఎలా విజయాన్ని అందుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: పరాజితుడిగా ముద్రపడిన ఓ యువకుడి విజయ గాథే ఈ చిత్రం. వేర్వేరు సినిమా పాటలు చిత్రలహరి (దూర్‌దర్శన్‌ కార్యక్రమం)లో ఎలా ప్రసారమవుతాయో, అలా వేర్వేరు జీవితాలు కలిసిన కథ అంటూ ఆరంభంలోనే ‘చిత్రలహరి’ పేరు వెనక అంతరార్థాన్ని దర్శకుడు చెప్పాడు. అయినప్పటికీ, ఈ కథకి ఆ పేరుకి పెద్దగా సంబంధమేమీ లేదు. ఎందులోనూ గెలుపు చూడని ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన ఇద్దరమ్మాయిలు అతన్ని ఎలా ప్రభావితం చేశారన్నదే ఇందులో కీలకం. సునిశితంగానే హాస్యం పంచే సన్నివేశాలు, మాటలతోనే చమక్కులు పంచడంలోనూ నేర్పరి అయిన కిషోర్‌ తిరుమల ఆ విషయంలో మరోసారి తన ప్రతిభని చాటి చెప్పాడు. నేరుగా కథలోకి వెళ్లాడు. విజయ్‌కృష్ణ పాత్ర, వాస్తవికత ఉట్టిపడే అతని కథ ప్రేక్షకుడిని వేగంగా సినిమాలో లీనం చేస్తుంది. విజయ్‌కృష్ణకు గ్లాస్‌మేట్‌గా కనిపించిన సునీల్‌ నేపథ్యంలో సన్నివేశాలతో పాటు... విజయ్‌ - లహరిల ప్రేమ నేపథ్యం కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఇద్దరి ప్రేమ బంధాన్ని బలంగా ఆవిష్కరించకముందే... ఆ ఇద్దరూ విడిపోవడంతో తగిన స్థాయిలో భావోద్వేగాలు పండలేదు. దాంతో విరామ సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.

ఆ తర్వాత విజయ్‌ - స్వేచ్ఛల ప్రయాణం మొదలవుతుంది. స్వేచ్ఛ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది కానీ... ద్వితీయార్ధంలో కథలో బలం లోపించింది. సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంటాయి. సాయిధరమ్‌ తేజ్‌ - పోసానిల మధ్య సన్నివేశాలు, వెన్నెల కిషోర్‌ కామెడీ మినహా ద్వితీయార్ధం కథలో సంఘర్షణ అంటూ ఏమీ ఉండదు. పతాక సన్నివేశాలు కూడా నాటకీయంగా అనిపిస్తాయి. తన ప్రాజెక్ట్‌ని నిరూపించడానికి తానే ప్రాణాల్ని పణంగా పెట్టే ప్రయత్నం అంతగా అతకలేదు. కిషోర్‌ తిరుమల ఇదివరకు చేసిన సినిమాల్లో భావోద్వేగాలు బలంగా పండాయి. ఇందులో ఆ మోతాదు బాగా తగ్గింది. హాస్య సన్నివేశాల పరంగా మాత్రం తన ప్రత్యేకతని మరోసారి ప్రదర్శించారు.