కన్నీళ్ళు పెట్టుకున్న కౌశల్‌

గత కొన్ని రోజులుగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. లవ్‌ ఫెయిల్యూర్‌, స్వామి రారా సినిమాలతో ఫేమస్‌ అయిన పూజా రామచంద్రన్‌ అర్దరాత్రి దాటాక బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులను సర్‌ప్రైజ్‌ చేయడం కోసం.. కౌశల్‌ సలహా మేరకు డైనింగ్‌ టేబుల్‌ కింద దాక్కున్నారు. అంతా నిద్రలేచిన తర్వాత ఆమె సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే, ఆమె రాకను చూసి హౌస్‌మేట్స్ అంతా అవక్కయ్యారు. ఆమెను దూరం పెట్టేందుకు ప్రయత్నించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినవారిని దూరంగా పెట్టాలని ముందుగానే నిర్ణయం తీసుకున్న నేపథ్యలో పూజాను దూరంగా ఉంచారు. అయితే, కౌశల్ ఒక్కడే ఆమెకు క్లోజ్‌గా ఉంటూ హౌస్‌లో నిబంధనలు గురించి వివరించాడు.

ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్‌ మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్‌ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్‌ ఇవ్వాలి. ఇలా ఫోన్‌ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్‌ చేసి.. వారిచ్చే హింట్స్‌ను గుర్తుపట్టి సరైన హౌజ్‌మేట్‌కు ఫోన్‌ను ఇచ్చేయాలి. ఇలా గుర్తుపట్టని యెడల ఆ ఫోన్‌ కట్‌ అయిపోతుంది. ఆ హౌస్‌ మేట్‌కు తన వాళ్లతో మాట్లాడే అవకాశం కోల్పోతారు.

మొదటి కాల్‌ కౌశల్‌కు

ఈ టాస్క్‌లో భాగంగా గీతా ఫోన్ ఎత్తి.. అది కౌశల్‌కు వచ్చినట్లు కరెక్ట్‌గా అంచనా వేసింది. కౌశల్‌ అతడి భార్య, పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు . కౌశల్‌ భార్య మాట్లాడుతూ ‘‘మీరు హౌస్‌లో మంచి ప్రవర్తనతో ఉండి ప్రజల అభిమానం పొందారు. మీరు అలాగే ఉండండి. ఎవరినీ నమ్మకండి’’ అని కౌశల్ భార్య నందినిని ఉద్దేశిస్తూ సూచనలు చేసింది. అనంతరం కౌశల్.. రోల్‌ రైడా కాల్‌ను కరెక్ట్‌గా అంచనా వేయడంతో.. రైడాకు తన చెల్లితో మాట్లాడే అవకాశం లభించింది. 

దీప్తి సునైనా తండ్రి కాల్‌ను అందుకున్న రోల్ రైడా.. ఆ ఫోన్ కాల్ ఆమెదే అని కరెక్ట్‌గానే కనిపెట్టాడు. అయినా సరే, ఫోన్ కట్ అయ్యింది. అయితే, క్లూ ఇవ్వడానికి బదులు ఆమె తండ్రి ఇంటి పేరు చెప్పడం వల్ల ఫోన్ కట్ చేశామని బిగ్‌బాస్ తెలిపాడు. ఆ తర్వాతి కాల్ సామ్రాట్‌కు వచ్చింది. 

సామ్రాట్‌‌ తల్లి ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘గెడ్డం తీశాక బాగున్నావు. బాగా సన్నగా అయ్యావు. ఎందుకు వెళ్లావో అదే గుర్తుంచుకుని ఆడు. ఒకరితోనే కనెక్ట్ కావడం వల్ల బయట బాగా నెగటివ్ టాక్ వచ్చింది. నిన్ను మేం అర్థం చేసుకుంటాం. కానీ, ప్రజలు అర్థం చేసుకోరు. అందరితో సమానంగా ఉండు. వేరేవీ ఏవీ అంటించుకోకు. నీ గురించి నెగటివ్‌గా వినడం మాకు ఇష్టం లేదు’’ అని తెలిపారు.