మా’ అధ్యక్షుడిగా నరేశ్‌ ప్రమాణస్వీకారం

మా’ అధ్యక్షుడిగా నరేశ్‌ ప్రమాణస్వీకారం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్‌ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయంలో కొంతకాలంగా నరేశ్‌కు, ‘మా’ మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజాకు అభిప్రాయభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ప్రమాణస్వీకారానికి శివాజీరాజా కూడా హాజరుకావడం గమనార్హం. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. ‘ 

‘మా’ కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారు చెప్పిందేంటంటే.. ‘మేం ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఫండ్స్‌ తీసుకొచ్చిపెట్టాం. దాంట్లోంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు కష్టపడి బయటనుంచి ఫండ్లు కలెక్ట్‌ చేసి తీసుకురావాలి’ అని చెప్పారు. తూచా తప్పకుండా వారి మాటను నేను పాటించాను. అదే విధంగా ఇప్పుడు పనిచేయబోయే కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నాను. నా నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమే’ అన్నారు. ‘మా’ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించినట్లు ఈ సందర్భంగా నరేశ్‌ వెల్లడించారు. ఈ పాటను సూపర్‌స్టార్‌ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు.