హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఎస్సార్‌ నగర్‌లోని స్వగృహంలో ఉదయం 3:30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో ఆయన జన్మించారు400 పైగా సినిమాల్లో హనుమంతరావు నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది  పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదన్నారు. ఇటీవల గుండు హనుమంతరావు అనారోగ్యతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రబుత్వము కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.

‘అహనా పెళ్లంట’  సినిమాతో హనుమంత రావు సినీరంగ ప్రవేశం చేశారు.ఇక బుల్లితెరపై ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంజి పాత్రలో ఆయన నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు.గుండు హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. అనారోగ్య కారణంగానే కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.