118 మూవీ రివ్యూ

118 మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, షాలిని పాండే, నివేదా థామ‌స్, నాజ‌ర్‌, ప్ర‌భాస్ శ్రీను, అశోక్ కుమార్‌, రాజీవ్ క‌న‌కాల, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ త‌దిత‌రులు

మాట‌లు: మిర్చి కిర‌ణ్‌

సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌

కూర్పు: తమ్మిరాజు

పోరాటాలు: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌,

నిర్మాత‌: మ‌హేష్ కొనేరు

క‌థ‌, ఛాయాగ్ర‌హ‌ణం, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌

కెరీర్ ప్రారంభం నుండి చేసే ప్ర‌తి సినిమాలో ఏదో కొత్త‌గా చేయాల‌ని ఆలోచించి, చేస్తూ వచ్చిన హీరోల్లో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఒక‌డు. అలాగే కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇచ్చే హీరోల్లో ఎప్పుడూ ముందుండే క‌ల్యాణ్ రామ్ ఈసారి సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్‌కు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చారు. పి.ఆర్ నుండి నిర్మాత‌గా మారిన మ‌హేష్ కొనేరు బ్యాన‌ర్‌లో రెండో సినిమాగా `118` రూపొందింది. టైటిల్ అనౌన్స్ చేయ‌గానే.. టైటిల్ భ‌లే ఉందే! అనుకున్నారంద‌రూ. అస‌లు 118 అంటే ఏంటి? స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో క‌ల్యాణ్ రామ్ చేసిన 118 త‌న‌కు విజ‌యాన్ని అందించిందా? నిర్మాత‌గా మ‌హేష్ కొనేరు, ద‌ర్శ‌కుడిగా కె.వి.గుహ‌న్ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ముందు క‌థేంటో చూద్దాం..

 క‌థ‌

గౌతమ్‌ (కల్యాణ్ రామ్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను ఓ కల బాగా డిస్ట్రబ్‌ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్‌ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్‌ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌:

జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. గతంలో ఇజం సినిమాలో రిపోర్టర్‌ గా కనిపించిన కల్యాణ్‌ రామ్‌ ఈ సారి స్టైలిష్‌ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. థ్రిల్లర్ సినిమా కావటంతో రొమాన్స్‌, డ్యాన్స్‌లకు  పెద్దగా స్కోప్‌ లేదు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్‌ చూపించింది. హీరోయిన్‌ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్‌ శ్రీను, నాజర్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

త‌న క‌ల్లోకి వ‌చ్చిన అమ్మాయికి ఏమైంద‌ని హీరో వెత‌క‌డమే క‌థ‌. దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాల స‌మాహార‌మే ఈ సినిమా. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు క‌థ ఆస‌క్తిక‌రంగానే న‌డిచింది. కానీ ఇంట‌ర్వెల్ త‌ర్వాత సినిమా అంత త్వ‌ర‌గా ముంద‌డుగు వేసిన‌ట్టు అనిపించ‌దు. దాంతో సెకండాఫ్ కాస్తా పేల‌వంగానే సాగింది. పైగా ఏదో సోష‌ల్ కాజ్ కోసం అమ్మ‌యి వెళ్ల‌డం, ఆమెను విల‌న్లు చంపేయ‌డం అనేది మామూలుగానే అంద‌రి ఊహ‌కూ అందే విష‌య‌మే. అయినా కొత్త‌గానే చూపించాల‌ని ప్ర‌య‌త్నించారు. ఆ ప్ర‌య‌త్నంలో కొన్ని చోట్ల ఆశించిన ఫ‌లితం రాలేదు. క‌ళ్ల ముందు త‌న‌ను త‌రుముకుంటూ వ‌చ్చి కొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారిని ప‌ట్టుకుని ఆరా తీస్తే తెలిసిపోయే విష‌యాల కోసం... వాళ్ల‌ని వ‌దిలేసి హీరో గ‌దిలోకి వెళ్లి త‌లుపులు ఎందుకు వేసుకోవాలో అర్థం కాదు. ప్రీ క్లైమాక్స్ కి ముందు వ‌చ్చే ఫైట్‌లో కూడా చ‌ర్చి ఫాద‌ర్‌ను పుటుక్కున కాల్చేసిన రౌడీ ఆ త‌ర్వాత గ‌న్ను చేతిలోనే ఉన్నా హీరోతో ఫైట్ చేస్తాడు. ఎప్ప‌టికో గ‌న్ను గుర్తుకొచ్చిన‌ట్టు తీసి కాల్చే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ చిత్రంలో క‌ల్యాణ్‌రామ్‌కి మేక‌ప్ స‌రిగా  స‌రిపోలేదు. షాలినీ, నివేదా, హ‌రితేజ, మీనా త‌దిత‌రులంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే చేశాను. సినిమాలో క‌ల్యాణ్‌రామ్ ముఖంలో క‌నిపించే టెన్ష‌న్ థియేట‌ర్ల‌లో కూర్చున్న ప్రేక్ష‌కులు ఫీల్ అయితే సినిమా స‌క్సెస్ అయిన‌ట్టే. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. స్టైలిష్‌ టేకింగ్‌తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.